రాజధాని అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత లభిస్తున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందని, దీంతో ఆయన అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. బుధవారంనాడు జరిగిన పత్రికా సమావేశంలో ఆయన జగన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనాన్ని విమర్శించారు.
రాజధాని అమరావతి చట్టబద్ధత దిశగా రాష్ట్ర శాసన సభ తీర్మానం చేసిన అనతి కాలంలోనే కేంద్రంలోని కూటమి ప్రభుత్వం లోక్‌సభలో బిల్లును ఆమోదింపజేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు మంత్రి సత్యకుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన పలు పార్టీలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
తాడేపల్లి ప్యాలెస్‌లో అమరావతి రాజధానికి తాను వ్యతిరేకిని కాదని జగన్ రెడ్డి వెల్లడించిన కొద్ది గంటల్లోనే లోక్‌సభలో వైసీపీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేయడం జగన్ రెడ్డి మోసపూరిత వైఖరిని వెల్లడించిందని మంత్రి సత్యకుమార్ ఎత్తిచూపారు. గతంలో 33,000 ఎకరాల్లో అమరావతిలో రాజధానిని నిర్మించాలని సూచించిన జగన్ రెడ్డి, అనంతరం విశాఖపట్నంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర ప్రజల కలల సాకారం కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో రాజధాని నిర్మాణానికి బాటలు వేశారని, అనంతరం అధికారంలోకొచ్చిన జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాజధాని విధ్వంసానికి గురైందని మంత్రి అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజల కలలు కనిపిస్తుంటే మాజీ సిఎం జగన్ అందులో అవినీతి జాడలను వెతుక్కుంటున్నారని ఎండగట్టారు.
అమరావతి రాజధాని కోసం శాసన సభ తీర్మానం ఎందుకు అని ప్రశ్నించిన జగన్‌రెడ్డి సమాధానం కూడా తానే చెప్పుకున్నారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అటువంటి వినాశకర, విధ్వంసక చర్యలను అడ్డుకోవడానికే పార్లమెంట్ చట్టం ద్వారా రాజధాని అమరావతికి శాశ్వతత్వం కల్పించడానికే ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భవ్య రాజధాని అమరావతి ఆవిష్కారాన్ని జగన్‌రెడ్డి కుట్రలు, దుష్ప్రచారంతో అడ్డుకోలేరని స్పష్టం చేశారు.











