రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ తెగిపోయి ఆరేళ్లు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్లబండ వద్ద తెగిపోయిన కాలువను ఆయన పరిశీలించారు.
పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం వీపనగండ్ల మండలం నాగర్లబండ తండా శివారులో రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ (ప్యాకేజీ-16) ప్రధాన కాలువకు ఏర్పడిన గండిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆరేళ్లుగా మరమ్మతులు చేపట్టని అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నిర్మించిన ఈ కాలువ ద్వారా 16,666 ఎకరాలకు సాగునీరు అందుతున్నట్లు అధికారులు చెబుతున్నారని, అయితే వాస్తవానికి 2019 జూలై 23న కాలువ తెగిపోయిందని మంత్రి పేర్కొన్నారు. అప్పటి నుంచి నేటి వరకు మరమ్మతులు చేయకుండా తప్పుడు నివేదికలు పంపడంపై ఆయన అధికారులను నిలదీశారు.
కాలువ తెగిపోవడంతో చివరి ఆయకట్టు వరకు నీరు అందక తాము తీవ్రంగా నష్టపోతున్నామని స్థానిక రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ పనులను చేపట్టిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మంత్రి విమర్శించారు.
కాలువ మరమ్మతులు సహా మిగిలిన పనులన్నింటికీ కాంట్రాక్టరుదే పూర్తి బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. తక్షణమే కాలువ గండిని పూడ్చి, మిగిలిన పనులను పూర్తి చేసి చివరి ఎకరా వరకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సాగునీరు అందించడంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.










