తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రసిద్ధి చెందిన కొండగట్టు అంజన్న ఆలయానికి నీతీ ఆయోగ్ రూపొందించిన 'దివ్య భారత్' పుస్తకంలో ప్రత్యేక స్థానం లభించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను పరిచయం చేసే ఈ పుస్తకంలో ఆలయానికి చోటు దక్కడం విశేషం.
నీతీ ఆయోగ్ రూపొందించిన 'దివ్య భారత్' పుస్తకం దేశంలోని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలను ఒకేచోట సమగ్రంగా పరిచయం చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు భారతదేశంలోని ముఖ్యమైన దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, పర్యాటక కేంద్రాలపై అవగాహన కల్పించడం.
ఈ నేపథ్యంలో, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం ఎంపిక కావడం స్థానికంగా గర్వకారణంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక ప్రాచీన, ప్రసిద్ధ ఆలయాలు ఉన్నప్పటికీ, వాటిలో కేవలం కొండగట్టు అంజన్న ఆలయానికే ఈ పుస్తకంలో స్థానం దక్కడం ప్రత్యేకతగా నిలిచింది.
కొండగట్టు అంజన్న ఆలయం తెలంగాణలో అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు.
ఈ గుర్తింపుతో, కొండగట్టు అంజన్న ఆలయం దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఇది ఆలయ ప్రాముఖ్యతను, ఆధ్యాత్మికతను విస్తృతంగా చాటిచెప్పనుంది.











