ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకల తండా శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు.
ఏకలవ్య నర్సరీ సమీపంలో వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ఒక లారీ ఆలుగడ్డ లోడుతో, మరో లారీ బొగ్గు లోడుతో ప్రయాణిస్తుండగా, అవి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఢీకొన్న వెంటనే వాహనాలకు మంటలు అంటుకోవడంతో డ్రైవర్లు మంటల్లో చిక్కుకున్నారు.
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు క్లీనర్లకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ప్రమాదం కారణంగా వరంగల్–ఖమ్మం రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతుల గుర్తింపునకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.








