ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, మొత్తం 125 దరఖాస్తులు అందాయి. ప్రజావాణిలో అందిన అర్జీల పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, పింఛన్లు వంటి అంశాలకు సంబంధించిన వినతులు అధికంగా వచ్చినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా, ఆయా డివిజన్ కేంద్రాల్లోనే అర్జీలు సమర్పించి సేవలు పొందాలని సూచించారు.
ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి వినతిపై బాధ్యతాయుతంగా స్పందించి, ఫలితాలు కనిపించేలా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్.వి. గిరి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జెడ్పీ సీఈఓ చందర్, డీఆర్వో పాండు, జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.











