కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని బేబిపేట్ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికలతో స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరినట్లు కొత్తగా చేరిన నాయకులు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ పతాక ఎగురవేస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యంగా బీజేపీ యువకులు మాట్లాడుతూ, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాలన తీరు బాగుందని, దానిని చూసే తాము కాంగ్రెస్ లో చేరుతున్నామని పేర్కొన్నారు. ఈ చేరికల కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి హాజరై, కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, కాంగ్రెస్ నాయకులు సాయిబాబా, అరుణ్ గౌడ్ తో పాటు, పార్టీలో చేరిన సిహెచ్ ప్రదీప్ గౌడ్, స్వామి, రాజు, జి స్వామి, శల్వి గౌడ్, కే స్వామి తదితరులు పాల్గొన్నారు.












