నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కేవలం జనాభా లెక్కల సవరణ మాత్రమే కాదని, ఇది రాజకీయ చదరంగంలో అత్యంత కీలకమైన ఘట్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాల స్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే డీలిమిటేషన్ కమిషన్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రభావం గణనీయంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
గత అనుభవాలు: వై.ఎస్.ఆర్. వ్యూహం, టీడీపీ కంచుకోటల విచ్ఛిన్నం
సాంకేతికంగా ఇది స్వతంత్ర ప్రక్రియ అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో భౌగోళిక హద్దుల మార్పులు, మండలాల విలీనం వంటి విషయాల్లో అధికార పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా పావులు కదిపే అవకాశం ఉందని గత అనుభవాలు చెబుతున్నాయి. తమకు పట్టున్న ప్రాంతాలను ఒకే నియోజకవర్గంలోకి చేర్చడం లేదా ప్రత్యర్థి పార్టీల కంచుకోటలను ముక్కలు చేయడం ద్వారా ఎన్నికలకు ముందే సగం విజయాన్ని ఖరారు చేసుకోవచ్చనేది ఈ ప్రక్రియలోని ప్రధానాంశం.
ఆంధ్రప్రదేశ్: చంద్రబాబుకు అవకాశం, వైసీపీకి సవాలు
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న అనేక నియోజకవర్గాల స్వరూపాన్ని మార్చారని గుర్తు చేస్తున్నారు. నర్సరావుపేట, ప్రత్తిపాడు వంటి నియోజకవర్గాలను చీల్చి, టీడీపీ కంచుకోటలను కూల్చారని, ఒక సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాలను చీల్చడం లేదా రిజర్వేషన్ల మార్పుల ద్వారా టీడీపీ సీనియర్ నేతల నియోజకవర్గాలను గాలిలో దీపాలుగా మార్చడంలో వైఎస్సార్ సఫలమయ్యారని పేర్కొన్నారు. దీనివల్ల 2009 ఎన్నికల్లో అనేక చోట్ల టీడీపీ బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ, భౌగోళిక మార్పుల వల్ల ఓటమి పాలయ్యారని తెలిపారు.
తెలంగాణ: రేవంత్ రెడ్డికి హైదరాబాద్ ఫ్యాక్టర్, అర్బన్ ఏరియాల ప్రభావం
ఇప్పుడు ఇదే అవకాశం చంద్రబాబు నాయుడికి రాబోతోందని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ఈసారి ఏపీలో వైసీపీ ప్రాబల్యాన్ని తగ్గించేలా హద్దుల నిర్ణయంలో తన ముద్ర వేసే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా డీలిమిటేషన్ ఒక గొప్ప అవకాశం అయినప్పటికీ, ఇక్కడ ఒక చిక్కు ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణలో జనాభా పెరుగుదల ఎక్కువగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉందని, పెరిగే సీట్లలో మెజారిటీ ఈ అర్బన్ ఏరియాల్లోనే ఉంటాయని, ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ అంత బలంగా లేదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్కు పట్టు ఉన్నప్పటికీ, అక్కడ సీట్ల సంఖ్య పెద్దగా పెరగకపోవచ్చని, కాబట్టి, పెరిగే కొత్త సీట్లు రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఎంతవరకు అడ్వాంటేజ్ ఇస్తాయనేది సందేహమేనని అంచనా వేస్తున్నారు.











