కూకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకునిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడికి పాల్పడిన సంఘటనపై టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ బండి రమేష్ తీవ్రంగా స్పందించారు. దాడులను ఉపేక్షించేది లేదని, రాజకీయ విమర్శలు దాడుల రూపం దాల్చడం అనైతికమని ఆయన అన్నారు.
సోషల్ మీడియా కో ఆర్డినేటర్ పై జరిగిన దాడిని ఖండించిన బండి రమేష్, గత ప్రభుత్వంలో పదవులు అనుభవించిన నాయకులు ఇలా ప్రవర్తించడం సరికాదని విమర్శించారు. 'ఎవరో ఫార్వర్డ్ చేసిన దానిని ట్రోల్ చేస్తే దాడులకు దిగడం అనైతికం. గతంలో ఈ పార్టీ నుంచే నాయకుడిగా ఎదిగినవారు తమ మూలాలను మర్చిపోవడం ఎలా?' అని ప్రశ్నించారు.
మరో బీఆర్ఎస్ నాయకుడు 'ఇంట్లోకి దూరి కొడతాం' అని ఫేస్బుక్లో పోస్ట్ చేయడంపై రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నీతిలేని రాజకీయాలు చేయాలనుకుంటే, వారి ఇళ్లలోకి దూరి కొట్టేవారమని, కానీ వారి పార్టీలోని అసభ్యకర విషయాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కూకట్పల్లి పోలీసులు సకాలంలో స్పందించి, నిందితులను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదలివచ్చి అండగా నిలిచినందుకు వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ సంఘటనతో పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది.
రాజకీయ విమర్శలను దాడుల రూపంలో వ్యక్తం చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడుతున్నారు.











