జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారు చిలక మొక్కజొన్న నిల్వ గోడౌన్తో పాటు ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
బంగారు చిలక మొక్కజొన్న గోడౌన్లో 2,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని, వివిధ మండలాల నుంచి మొక్కజొన్న వస్తోందని అధికారులు కలెక్టర్కు వివరించారు. లారీల అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, రాత్రివేళల్లో కూడా పనులు కొనసాగించేలా లైటింగ్ సౌకర్యాలు కల్పించాలని, అవసరమైతే అదనపు హమాలీలను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు.
గోడౌన్లో మొక్కజొన్న నిల్వలను పూర్తి సామర్థ్యంతో వినియోగించుకునేలా, ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. బస్తాలను సాధ్యమైనంత ఎక్కువ ఎత్తులో పేర్చాలని, హమాలీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనుల పురోగతి, నాణ్యతపై కలెక్టర్ ఆరా తీశారు. గత సంవత్సరం మే నెలలో ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల ఆలస్యానికి గల కారణాలను నివేదించాలని, జాప్యం చేసిన కాంట్రాక్టర్లకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భవనాన్ని స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ కార్యకలాపాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు.







