భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం, పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.351 కోట్లు మంజూరు చేసిందని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం 'దక్షిణ అయోధ్య'గా ప్రసిద్ధి చెందిందని, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. గురువారం మిథిలా స్టేడియంలో స్వామివారి కల్యాణం, మహా పట్టాభిషేకం ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు విచ్చేస్తున్నారని తెలిపారు.
కల్యాణం శుక్రవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మహా పట్టాభిషేకం 28వ తేదీన అదే సమయంలో నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, దేవస్థానం అభివృద్ధికి రూ.351 కోట్లు మంజూరు చేశామని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు భూమిపూజ జరుగుతుందని వెల్లడించారు. దేవాలయంతో పాటు భద్రాచలం పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
భక్తుల సౌకర్యం కోసం రహదారులు, రైల్వే, నదీ మార్గాల అభివృద్ధిపై చర్యలు తీసుకుంటున్నామని, అమరావతి–జగదల్పూర్ మధ్య రవాణా సౌకర్యాల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి చెప్పారు. భద్రాచలాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకొని కరకట్టల ఎత్తు పెంపు, ఘాట్ల నిర్మాణం, రెండో పీట నిర్మాణం వంటి పనులు చేపట్టినట్లు, భవిష్యత్తులో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఎస్పీ రోహిత్ రాజ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులతో సమీక్ష నిర్వహించి, తలంబ్రాల కౌంటర్లు, ప్రసాదాల కౌంటర్లు, పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వైద్య సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.











