దేశంలో బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో సరైన వాటా దక్కడం లేదని, చట్టసభల్లో వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఓబీసీ సెమినార్లో ఈ మేరకు తీర్మానం చేశారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెమినార్లో పలువురు తెలుగు ఎంపీలు, మాజీ ఎంపీలు, టీడీపీ అధికార ప్రతినిధి పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచినా బీసీల అభ్యున్నతికి పాలకులు తగిన చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు.
ఇకనైనా ఎన్డీయే ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కట్టుబడి, పార్లమెంటులో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను ప్రధానికి విన్నవించుకోవడానికి త్వరలో కలవనున్నట్లు తెలిపారు.
ప్రధాని మోదీ హయాంలోనే బీసీలకు న్యాయం జరగాలని, లేదంటే భవిష్యత్తులో ఇది సాధ్యం కాదని వారు అభిప్రాయపడ్డారు. బీసీల కోసం రూ.2 లక్షల కోట్లతో ప్రత్యేక పథకం ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడానికి రాజ్యాంగ సవరణ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరారు.










