కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం రాత్రి హైదరాబాద్లోని పాతబస్తీలో పర్యటించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై, ముఖ్యంగా పాతబస్తీ శాంతిభద్రతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
పాతబస్తీలో నివసిస్తున్న పశ్చిమ బెంగాల్ వాసులతో సమావేశమైన బండి సంజయ్, బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం నేతలకు, ఒవైసీ సోదరులకు 'దాసోహం' అయ్యారని ఆరోపించారు.
పాతబస్తీలో పోలీసులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, "పాతబస్తీని మొత్తం ఒవైసీ సోదరులకు రాసిచ్చారా?" అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రాజధానిలోని ఒక ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడలేని ప్రభుత్వం, ఇతర ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేస్తుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
పాతబస్తీలో ఒక చట్టం, మిగతా నగరంలో మరో చట్టం అమలు చేస్తున్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణిని వీడాలని, లేనియెడల ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
ఈ పర్యటనలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కూడా ఆయన పేర్కొన్నారు.











