నేడు అక్షయ తృతీయ పండుగ సందర్భంగా, ఈ పవిత్ర దినాన చేపట్టే కార్యాలు, కొనుగోళ్లు శుభదాయకమని విశ్వాసం. స్వర్గం నుండి గంగా నది భూమిపైకి అవతరించిన రోజుగా, పాండవులు అక్షయ పాత్రను పొందిన రోజుగా దీనిని పరిగణిస్తారు.
అక్షయ తృతీయ భాగ్యం, ఐశ్వర్యాన్ని వృద్ధి చేసే అనేక శుభకార్యాలకు ప్రసిద్ధి. ఈ శుభ దినాన దానధర్మాలు చేయడం, మంత్రాలను జపించడం, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు.
ఈ పవిత్ర దినాన ఎలాంటి శుభకార్యం ప్రారంభించడానికైనా ప్రత్యేక సమయం లేదా ముహూర్తం చూడాల్సిన అవసరం లేదని నమ్ముతారు. బంగారం, వెండితో పాటు భూమి, ఇతర విలువైన స్థిరాస్తుల కొనుగోలు కూడా ఈ రోజు శుభప్రదం.
ఇత్తడి, కంచు లోహాల పాత్రలు లేదా వాటితో చేసిన వస్తువులను కొనుగోలు చేయడం కూడా అదృష్టకరమని భావిస్తారు. అంతేకాకుండా, ఫర్నిచర్, కొత్త వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు వంటి వాటిని ఇంట్లోకి తీసుకురావడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది.
ఈ రోజున చేసే ఏ శుభ కార్యమైనా ఇటు ఐశ్వర్యాన్ని, అటు అదృష్టాన్ని అందిస్తుందని నమ్ముతారు. మీ శక్తి మేరకు పనులు చేయవచ్చని సూచన.







