ప్లాస్టిక్ భూతాన్ని తరిమి, కాలుష్యాన్ని నివారించి, భావితరాలకు ఆస్తులతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిద్దామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ కవర్లు, వస్తువుల వాడకాన్ని దూరంగా ఉండాలని ఆమె సూచించారు.
పెనుకొండ పట్టణంలో 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత, ప్లాస్టిక్ వాడకం వల్ల ఆరోగ్యం, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నాయని అన్నారు. ఇళ్లల్లోకి, గ్రామాల్లోకి ప్లాస్టిక్ రాకుండా చేయడంలో మహిళల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. చెత్తపై పన్ను రద్దు చేసి, అదే చెత్తతో సంపద సృష్టిస్తున్నారని, చెత్తతో వర్మీ కంపోస్ట్, సేంద్రీయ ఎరువులు తయారు చేస్తున్నారని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయంతో పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యానికి మేలు కలుగుతుందని, ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని మంత్రి సవిత తెలిపారు. సేంద్రీయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చని ఆకాంక్షించారు. జంక్ ఫుడ్ వాడకం తగ్గించాలని, చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు మంత్రి సవిత తన క్యాంపు కార్యాలయం నుంచి నడిచి గాంధీ సర్కిల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ కవర్లకు బదులు కాటన్ వస్త్రాలతో చేసిన క్యారీ బ్యాగులను అందజేసి, వాటిని ఉపయోగించాలని సూచించారు. షాపుల ఎదుట పడి ఉన్న చెత్తను స్వయంగా తీసి డస్ట్ బిన్ లో వేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.











