రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమలు చేస్తున్న హరిత నిధి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, అన్ని ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగిన హరిత నిధి 7వ రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశానికి మంత్రి కొండా సురేఖ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గతంలో మంజూరైన ప్రాజెక్టుల అమలు తీరును ఆమె సమీక్షించారు. పలు కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.
నర్సరీల ఏర్పాటు, అర్బన్ పార్కుల అభివృద్ధి, అటవీ సంరక్షణ, పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన, ఎకోటూరిజం అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలకు సమావేశంలో ఆమోదం లభించింది. భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులు చేపట్టబడుతున్నాయని మంత్రి తెలిపారు.
అమలులో ఉన్న పనులతో పాటు కొత్త ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టులను రూపకల్పన చేసి, పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు.
అటవీ సంపద, జీవ వైవిధ్య పరిరక్షణతో పాటు ఎకోటూరిజం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి హరిత నిధి లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు.











