తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మూడు రోజుల యువ నాటకోత్సవం ప్రారంభమైంది. రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నాటకోత్సవం మే 8 వరకు కొనసాగుతుంది.
ఈ సందర్భంగా మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ కళాకారులకు వేదికగా నిలుస్తూ, సాంస్కృతిక రంగానికి విశేష సేవలు అందిస్తోందని అన్నారు. యువ కళాకారుల ప్రతిభను వెలికితీయడంలో అకాడమీ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధి, సంప్రదాయ పరిరక్షణలో సంగీతం, నాటకం ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో కళల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని, యువతకు అవకాశాలు కల్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
సమాజంలో నటనకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ, కళాకారులు తమ ప్రతిభతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని మంత్రి సూచించారు. యువ నాటకోత్సవం ద్వారా కొత్త కళాకారులు వెలుగులోకి వస్తారని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.











