సంగారెడ్డి, జూలై 31
సంగారెడ్డి: విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు శుక్రవారం సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. సుమారు 8వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, గౌరవ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర, సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు ప్రభుగౌడ్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పట్లోళ మల్లికార్జున్ పాటిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా బీసీ సంక్షేమ సంఘం సభ్యులు అడిషనల్ కలెక్టర్ పాండును కలిసి ఈ వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రభుగౌడ్, మల్లికార్జున్ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం సుమారు 8వేల కోట్ల రూపాయల మేరకు ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఈ బకాయిల మూలంగా విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. విద్యార్థుల సర్టిఫికెట్లను కళాశాలలు ఇవ్వడం లేదని, కొత్తవారికి అడ్మిషన్లు కూడా కష్టంగా మారుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి కృష్ణ, కార్యదర్శి ముత్యనీ శేఖర్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కవేలి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు కొత్తగొల్ల మల్లేష్ యాదవ్, శ్రీధర్ మహేంద్ర, అధికార ప్రతినిధి కుమ్మరి సాయిలు, కార్యదర్శి శ్రీనివాస్, ప్రవీణ్, సభ్యులు రవీందర్, మహిళా కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షురాలు మానస తదితరులు పాల్గొన్నారు.










