తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఆస్థానం గురువారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని పుష్పాలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఉగాది పండుగను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం శుద్ధి కార్యక్రమం చేపట్టారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. అనంతరం విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించి, శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను అలంకరించారు.
శాస్త్రోక్తంగా జరిగిన ఉగాది ఆస్థానంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, జేఈవో (విద్య & వైద్యం) డాక్టర్ ఏ.శరత్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, దేశ, విదేశాల్లోని శ్రీవారి భక్తులకు నూతన శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఉగాది పండుగ సందర్భంగా టీటీడీ ఉద్యానవన విభాగం ఆలయ పరిసరాలు, మహాద్వారం, ఆలయం ముందు, జీఎన్సీ టోల్ గేట్ ప్రాంతాల్లో ఆకర్షణీయమైన పుష్పాలంకరణలు ఏర్పాటు చేసింది. ఈ పుష్పాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.











