శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పోలీస్ కమిషనర్ సీ.వీ. సజ్జనర్, ఐపీఎస్ నేతృత్వంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపారు.
నగరంలో జరగనున్న శ్రీరాముడి శోభాయాత్ర ప్రశాంతంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సీపీ సజ్జనర్ తెలిపారు. యాత్ర ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీతారాం బాగ్ ఆలయం నుంచి ప్రారంభమై, రాత్రి 10 గంటల కల్లా ముగిసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
యాత్ర సాగే మార్గాలను పలు శాఖల అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించినట్లు, ఎక్కడా ఎటువంటి అవాంతరాలు కలగకుండా డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని సీపీ పేర్కొన్నారు.
ఈ భారీ శోభాయాత్ర కోసం దాదాపు 3 వేల మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వివరించారు. అంతకుముందు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వీ. కర్ణన్ లతో కలిసి సీపీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.











