ఐశ్వర్యం, సౌభాగ్యాలు ప్రసాదించే శ్రీ లక్ష్మీ అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని కూకట్పల్లిలోని శ్రీ శ్రీ శ్రీ చిత్తారమ్మ ఆలయంలో శ్రీ మహాలక్ష్మి యాగం, శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు.
వడ్డేపల్లి రాజేశ్వరరావు, యామిని దంపతుల సౌజన్యంతో శ్రీ మహాలక్ష్మి యాగ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో, భక్తులందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మహాలక్ష్మి యాగం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు పలు ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.
యాగ అనంతరం, శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, మాతృమూర్తి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని, ప్రతి ఇంట ఐశ్వర్యం, ఆనందం, శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ధార్మిక, సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఈ యాగంలో రఘు గురూజీ, జి.నాగేశ్వరావు, ఏ.హనుమంతరావు, ఏ.ఆండాలమ్మ, అశోక్ యాదవ్, గొట్టిముక్కల భాస్కరరావు, మాధవరం నాగేష్ తో పాటు పలువురు ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు.











