సంగారెడ్డి, జూలై 19
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శాలివాహన బోనాల మహోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శాలివాహన బోనాల మహోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం బోనాల ఊరేగింపులో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తి, శ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
సంగారెడ్డి ఐబీ నుంచి కొనసాగిన బోనాల ఊరేగింపు అస్తబల్లోని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా శాలివాహన బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, చింత సాయినాథ్, శ్రీధర్ రెడ్డి, రామప్ప, జలేందర్, అంజద్, వాజిద్తో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












