మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి నియోజకవర్గంలోని మద్దికుంటలో బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం, రథోత్సవం వైభవంగా జరిగాయి. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్య రెడ్డి రథాన్ని లాగి ప్రారంభించారు.
మహాశివరాత్రి సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గంలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఉదయం నుంచే ఉపవాస దీక్షలతో భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం, సిద్ధరామేశ్వర ఆలయం, గడికోట శివాలయం, రామలింగేశ్వర ఆలయాలతో పాటు నియోజకవర్గంలోని ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉపవాసం ముగించిన భక్తులకు పండ్లు పంపిణీ చేశారు.
మద్దికుంటలోని బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్యరెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
అనంతరం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్య రెడ్డి కలిసి స్వామివారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి.


