ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు మూడవ రోజైన సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గోపూజ, మూలమంత్ర అనుష్ఠానములు, పురుష సూక్త హవనములు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నీలం మధు దంపతులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని, లోక కల్యాణం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సాయంత్రం జిటిఎన్ కాలనీ నుండి ఐలమ్మ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా మీదుగా సాగిన విగ్రహాల ఊరేగింపు, కనువిందు చేసే సాంస్కృతిక ప్రదర్శనలతో చూపరులను ఆకట్టుకుంది. 'జై శ్రీ రామ్' నినాదాలతో పుర వీధులు మారుమోగాయి.
కేరళ కళాకారుల విన్యాసాలు, శివ తాండవ నృత్యాలు, ఆంజనేయుడి వేషధారణ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కేరళ నుండి ప్రత్యేకంగా రప్పించిన చెండ మేళం, కథాకళి నృత్యాలు, శివ తాండవ నృత్యాలు ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చాయి.
ఈ సందర్భంగా శ్రీ రామ భక్తి గీతాలకు నీలం మధు దంపతులు మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ భక్తి పర్యవశ్యంలో మునిగిపోయారు. ఈ ఊరేగింపు వేడుకలను గ్రామ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాలనీ వాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.












