మాదకద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నిజామాబాద్‌లోని నిర్మల హృదయ పాఠశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
జిల్లాలో జూన్ 22 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ సదస్సు జరిగింది. సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్ఐలు హరిబాబు, నారాయణ విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. యువత సన్మార్గంలో నడిస్తేనే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత, కుటుంబ, సామాజిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు.
అనుమానాస్పద మాదకద్రవ్యాల కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. "డ్రగ్స్‌కు నో చెప్పండి... జీవితానికి యెస్ చెప్పండి" అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులతో పాటు సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు.












