నిజామాబాద్, జూలై 19
మైనర్ల చేత వాహనాలు నడిపించడాన్ని అరికట్టేందుకు రవాణాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. మోటారు వాహనాల చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మైనర్లు నడిపిన వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తోంది. ఈ చర్యల్లో హైదరాబాద్ తర్వాత అత్యధికంగా నిజామాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలవడం గమనార్హం. 2025 జూన్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 283 వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల కామారెడ్డి జిల్లా ఇల్చిపూర్ శివారులో 16 ఏళ్ల మైనర్ నడిపిన ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మైనర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అనంతరం మైనర్ డ్రైవింగ్‌పై ప్రభుత్వం, రవాణాశాఖ మరింత దృష్టి సారించాయి.
జిల్లాలోనూ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే మైనర్ విద్యార్థులు తల్లిదండ్రులు ఇచ్చిన ద్విచక్ర వాహనాలను నడుపుతూ తరచూ రోడ్లపై కనిపిస్తున్నారు. వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు కారణమవుతున్నారు. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి.
మోటారు వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 199ఏ (2019 సవరణ) ప్రకారం మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే వాహన యజమాని లేదా సంరక్షకుడినే బాధ్యుడిగా పరిగణిస్తారు. వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అదేవిధంగా సంబంధిత వాహనం రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేస్తారు.
పిల్లలు అడిగారని, చదువుకు ఉపయోగపడుతుందని భావించి చాలామంది తల్లిదండ్రులు మైనర్లకు బైక్‌లు కొనివ్వడం లేదా నడిపేందుకు అనుమతించడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లల భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.
– దుర్గా ప్రమీల, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ "మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా పరిధిలో 283 వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేశాం. తనిఖీల్లో మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడంతో పాటు వాహన యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. రవాణాశాఖ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి" అని ఆమె స్పష్టం చేశారు.