రాబోయే అకాల వర్షాల హెచ్చరికల నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా వరి కొనుగోలు ప్రక్రియను అత్యవసరంగా వేగవంతం చేయాలని అధికారులకు ఉన్నత స్థాయి సమావేశంలో ఆదేశాలు జారీ అయ్యాయి. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి, ఇన్చార్జ్ మంత్రులు, ప్రధాన కార్యదర్శి, సివిల్ సప్లైస్ కమిషనర్ జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే ఐదు రోజుల పాటు అనూహ్య వర్షాలు కురిసే అవకాశాల నేపథ్యంలో జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాల కారణంగా వరి తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లోని వరిని వెంటనే రైస్ మిల్లులు, గోదాములకు తరలించాలని ఆదేశించారు. నిల్వలను తార్పాలిన్లతో పూర్తిగా కప్పివేయాలని, డన్నేజ్ ఏర్పాటు చేసి తేమ నుంచి రక్షణ కల్పించాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో నీటి నిల్వలు లేకుండా డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయాలని, వర్షాల సమయంలో 24 గంటల పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులు తెలిపారు. అత్యవసర తరలింపులకు సిబ్బంది, వాహనాలను సిద్ధంగా ఉంచాలని, రవాణా, రైస్ మిల్లర్లతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
రైతులకు వరి సంరక్షణపై అవగాహన కల్పించాలని, రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రవ్యాప్తంగా వరి కొనుగోళ్లను సజావుగా కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు పునరుద్ఘాటించారు. ఈ సమీక్షలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.












