సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందే గ్రామంలో ఒక పౌల్ట్రీ ఫారంలో సుమారు 7,700 కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి.
రంగనమైన కుమార్కు చెందిన పౌల్ట్రీ ఫారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో కోళ్లు మరణించడంతో స్థానికంగా కలకలం రేగింది. రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన కోళ్ల నమూనాలను సేకరించి, పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు.
అధికారులు వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు, ప్రజలకు సూచనలు చేశారు. అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లక్షణాలను వెంటనే నివేదించాలని కోరారు.
ప్రయోగశాల నివేదిక అనంతరం మరణాలకు గల కచ్చితమైన కారణాలు తెలియనున్నాయని అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.

