రాష్ట్రంలో పశుసంవర్ధక రంగ అభివృద్ధిని మరింత వేగవంతం చేసే లక్ష్యంతో, రాష్ట్ర వ్యవసాయ, పాడిపరిశ్రామాభివృద్ధి శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 'పశుసంవర్ధక మార్గదర్శిని' అనే ఈ-మేగజైన్‌ను విజయవాడలో ఆవిష్కరించారు. ఈ-మేగజైన్ ద్వారా రైతులకు శాస్త్రీయ మార్గనిర్దేశం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ-మేగజైన్‌ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతులు పాడి పశువులు, సన్న జీవాలు, నాటు కోళ్ల పెంపకంతో అనుబంధం కలిగి ఉన్నారని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పశుసంవర్ధక శాఖ ద్వారా రూ.1,76,151 కోట్ల స్థూల విలువ వృద్ధి నమోదవడం ఈ రంగ ప్రాధాన్యతను స్పష్టం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
సంప్రదాయ యాజమాన్య పద్ధతులు, కూలీల కొరత, పశుగ్రాసాల లోపం, పెరుగుతున్న దాణా ఖర్చులు వంటి సమస్యల కారణంగా ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే, పశుసంవర్ధక రంగాన్ని వాణిజ్య సరళిలో అభివృద్ధి చేసుకునే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని, యువత ఈ రంగంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
విశాఖపట్నంలోని రాష్ట్ర పశుగణ యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవస్థాపక శిక్షణ కార్యక్రమాల్లో ఇప్పటివరకు 1500 మంది శిక్షణ పొందారని, వీరిలో 200 మందికి పైగా రైతులు వాణిజ్యపరంగా విజయవంతంగా కార్యకలాపాలు ప్రారంభించారని మంత్రి వెల్లడించారు. రైతులకు శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఈ-మేగజైన్‌ను www.apahsmile.in వెబ్‌సైట్‌తో పాటు రిలయన్స్ ఫౌండేషన్ వాట్సాప్ గ్రూపుల ద్వారా అందుబాటులో ఉంచుతున్నారు.
ఈ మేగజైన్లో పశు ఆరోగ్యం, పునరుత్పత్తి, పోషణ, యాజమాన్యం, మార్కెటింగ్, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై సమగ్ర సమాచారం, విజయగాథలు, నిపుణుల సూచనలు, రైతుల సందేహాలకు సమాధానాలు అందించబడతాయి. అలాగే, గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న పశుసంవర్ధక సహాయకులు, గోపాల మిత్రులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చేరవేయడంలో కూడా ఈ-మేగజైన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. సేంద్రియ, వాణిజ్య పద్ధతుల్లో అభివృద్ధి చేస్తే ఒక్క ఎకరం నుంచి సంవత్సరానికి రూ.5-6 లక్షల ఆదాయం పొందే అవకాశం ఉందని మంత్రి వివరించారు.











