కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్ద-2 గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పాడి కేంద్రంతో పాటు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సందర్శించారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రాబోయే నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున, రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, ORS ప్యాకెట్లు, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన పేర్కొన్నారు.
లారీలు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని, తద్వారా కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని తెలిపారు. ఈ సందర్శనలో సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, DRDO సురేందర్, DM శ్రీకాంత్, ప్రత్యేక అధికారులు, MEO, AO తదితరులు కలెక్టర్‌తో పాటు పాల్గొన్నారు.












