నిజామాబాద్, ఆగస్టు 1
బోధన్ రూరల్ పరిధిలోని సాలోరా క్యాంపు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది.
సాలోరా క్యాంపు సమీపంలో జరిగిన ద్విచక్ర వాహనాల ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బిలోలి తాలూకా కార్ల గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ (30), తన స్నేహితుడు పింజారి ఇర్ఫాన్ (22)తో కలిసి శుక్రవారం రాత్రి బోధన్‌లో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యాడు. అనంతరం ఇద్దరూ ఒకే ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అవుతుండగా, శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో సాలోరా క్యాంపు సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు బిలోలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే షేక్ అహ్మద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన పింజారి ఇర్ఫాన్‌ను మెరుగైన చికిత్స కోసం సంభాజీనగర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతుడి సోదరుడు షేక్ చాంద్ పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బోధన్ రూరల్ ఎస్సై తెలిపారు.












