మహబూబాబాద్ జిల్లాలో విందు భోజనం చేస్తుండగా మాంసం ముక్క గొంతులో ఇరుక్కుని ఒక వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గూడూరు మండలం పిల్లిగుండ్ల తండాలో మంగళవారం దుర్గమ్మ పండుగ సందర్భంగా 45 ఏళ్ల బానోత్ బిచ్చా తన బంధువులతో కలిసి రాత్రి విందు భోజనం ఏర్పాటు చేసుకున్నారు. భోజనం చేస్తుండగా, అనుకోకుండా ఒక మాంసం ముక్క ఆయన గొంతులో ఇరుక్కుపోయింది.
దీంతో బానోత్ బిచ్చాకు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే గొంతులో ఇరుక్కున్న మాంసం ముక్కను తొలగించేందుకు ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించలేదు.
పరిస్థితి విషమించడంతో, కుటుంబ సభ్యులు బానోత్ బిచ్చాను గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనను పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.










