వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపుతప్పిన కారు బోల్తా కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఒక పాదచారి ఉన్నారు.
మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని, ఒక బైక్ను ఢీకొట్టింది. ఈ ధాటికి కారు బోల్తా పడింది.
మృతి చెందిన విద్యార్థులను ఇంజినీరింగ్ ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శివ, సందీప్ జోహెల్గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను అప్పగించాలని కళాశాల విద్యార్థులు సంఘటనా స్థలంలో ఆందోళనకు దిగారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరుపుతామని వెల్లడించారు.











