రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ యూరియా బుకింగ్ యాప్ క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు కలిగిస్తోందని, దీనిని నిలిపివేసి, గతంలో మాదిరిగా మ్యానువల్ పద్ధతిని పునరుద్ధరించాలని టిఆర్ఎస్ పార్టీ సదాశివనగర్ మండల అధ్యక్షులు కలాలి సాయగౌడ్ డిమాండ్ చేశారు.
స్మార్ట్ ఫోన్ల పరిజ్ఞానం లేకపోవడం, సాంకేతిక లోపాలు, సర్వర్ సమస్యల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 70% మంది రైతులు యూరియాను బుక్ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. చాలామంది చిన్న, సన్నకారు రైతులకు స్మార్ట్ ఫోన్లు లేవని, ఉన్నా వాటిని ఎలా వాడాలో తెలియని పరిస్థితి ఉందని ఆయన తెలిపారు.
ఆధార్, పట్టాదారు పాస్ బుక్ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత రావాల్సిన ఓటీపీలు సకాలంలో రాకపోవడం, యాప్ ఓపెన్ చేయగానే 'నో స్టాక్' అని చూపించడం వంటి సమస్యలతో రైతులు గంటల తరబడి ఫోన్ల వద్దే కాలం గడపాల్సి వస్తోందని కలాలి సాయగౌడ్ అన్నారు. ఈ డిజిటల్ విధానం వల్ల 70 శాతానికి పైగా రైతులు యూరియా పొందలేకపోయారని ఆయన తెలిపారు.
ఒకవేళ అదృష్టం కొద్దీ యాప్ లో బుకింగ్ అయిన రైతులకు, సొంత గ్రామంలోని సొసైటీలు లేదా దుకాణాల్లో కాకుండా సుదూర మండల కేంద్రాల్లోని స్టోర్లలో స్లాట్లు కేటాయిస్తున్నారని, దీనివల్ల బుక్ అయిన యూరియాను తెచ్చుకోవడానికి రైతులు ఆటోలపై వెళ్లాల్సి వస్తోందని, ప్రతి బస్తాపై రవాణా ఖర్చుల రూపంలో రూ. 50 అదనపు భారం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కంటే రవాణా ఖర్చే ఎక్కువగా అవుతుందని, ఈ డిజిటల్ తిప్పలు రైతులకు వద్దని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ యాప్ విధానాన్ని పక్కన పెట్టి, గతంలో మాదిరిగా పట్టాదారు పాస్ బుక్ చూపించి నేరుగా స్థానిక సొసైటీలోనే యూరియా పంపిణీ చేసే మ్యానువల్ పద్ధతిని పునరుద్ధరించాలని, లేనిపక్షంలో మండల వ్యాప్తంగా రైతుల ద్వారా వ్యవసాయ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.












